మావి చిగురు తొడిగిన దగ్గర నుండి వసంత రుతువు గా చెప్పబడుతుంది. మనకున్న అన్ని మాసాల్లో ప్రతి మాసానికి ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీ కృష్ణునికి ఇష్టమైన రుతువుగా వసంత రుతువు చెప్పబడుతుంది. సంవత్సరం ప్రారంభంలో మొదటి మాసం చైత్రం, మొదటి నక్షత్రం అశ్విని, మొదటి తిది పాడ్యమి, మొదటి ఘడియ లో బ్రహ్మ సృష్టిని నిర్మించినందున అప్పుడే ఉగాది గా జరుపుకుంటారు.
ఉగాదిరోజు తలస్నానం చేసి కొత్త బట్టలు, వేసుకుని ఉగాది పచ్చడి తినటం, పంచాంగ శ్రవణం మాత్రమే కాదు. మరి కొన్ని పనులు కూడా ఉన్నాయి. మన పూర్వీకులు ఆచరించిన పనుల్లన్ని నేటి ఆధునిక ప్రపంచంలో మరుగున పడిపోతున్నాయి. అవేమిటి అంటే దవనంతో దేవుడిని ఆరాధించటం, ధ్వజారోహణం, చత్ర చామర వితరణ, ప్రసాదాన ప్రారంభం మొదలైనవి. దవనం అంటే మరువం లాంటిది. దానితో దేవుడిని పూజించాలి. ఉగాది రోజు ఇంటి ముందు ఒక వెదురు కర్ర పాతి దానికి పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. దాని పై రాగి చెంబు పెట్టి పూవులతో పూజిస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెప్పేవారు.
అలాగే ఇక్కడి నుండి వాతావరణంలో వేడి పెరుగుతుందని పేదలకు ఉన్నంతలో గొడుగులు, విసన కర్రలు దానం చేయాలి. ఎండని భరించలేని వారి కోసం మన పూర్వీకులు ఇంటి ముందు తాటాకు పందిర్లు వేసి కాస్త సేద తీరటానికి కాసిన్ని మజ్జిగ, చల్లని మంచి నీళ్ళు ఇచ్చేవారు. ఇలా మన పెద్దలు చెప్పేవి అన్ని నలుగురికి ఉపయోగ పడేవి. వాతావరణం లో వచ్చే మార్పులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి పుణ్యం , దానం వల్ల పురుషార్థం దక్కుతాయి.