అసలు వైఎస్సార్సీపీలో ఏం జరుగుతుంది. జగన్ మాటను ఖాతరు చేయకుండా.. ఆయన పార్టీ నేతలు ఎందుకు వ్యవవహరిస్తున్నారు??
ఏపీ అధికార పక్షం వైసీపీలో ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం జగన్ లక్ష్మణ రేఖలు గీశారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దని, నేరుగా వెళ్లి.. కేంద్రంలోని పెద్దలను కలవవద్దని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల మీరు ఏం చేస్తున్నారో.. మేం ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, దీనికి తోడు గిట్టని మీడియా ప్రచారం మరింత ఎక్కువై.. ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు వెళ్తాయనేది జగన్ ఉద్దేశం. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు.. అందరూ హద్దుల్లో ఉండాల్సిందేనని జగన్ ఆదేశించారు.
అయితే, వైసీపీలోనే ఉంటూ.. తన ఇష్టానుసారంగా వ్యవహరించాలని చూస్తున్న ఓ ఎంపీ మాత్రం దీనిని విభేదించారు. నేను ఎంపీని, ప్రజలు ఎన్నుకొన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలి. ఎవరిని కలిస్తే.. మాత్రం ఏమైంది? అని రెటమతంగా మాట్లాడడం ప్రారంభించారని సమాచారం. తాజాగా పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతూ.. ఆర్టికల్ 350, 350 ఏలను సంపూర్ణంగా అమలు చేయాలంటూ.. డిమాండ్ చేయడంతో పాటు.. పూర్తిగా తెలుగులోనే మాట్లాడాడు.
ఒకపక్క రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగు మీడియం వద్దు.. ఆంగ్లాన్ని అందిపుచ్చుకుని పేదలకు, బీదలకు, బడుగులకు ఆంగ్ల విద్యను అందించాలని నిర్నయించుకుంది. అయితే, దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సదరు ఎంపీ పార్లమెంటు వేదికగా ఇలా వ్యాఖ్యలు చేయడంపై జగన్ మరింతగా సీరియస్ అయ్యారు. దీనిపై వివరణ తీసుకోవాలని పార్టీ బాధ్యులను ఆదేశించారు.
అయితే, ఈ విషయం తెలిసిన ఆ ఎంపీ.. మరింత దూకుడు పెంచి.. నేను కోట్లకు కోట్లుఖర్చు పెట్టుకుని ఎంపీగా గెలిచానని, ఇప్పుడు ఎవరి నిర్బంధంలోనో నాకు పనిచేయాల్సిన అవసరం లేదని, నేను ప్రజలకు మాత్రమే జవాబు దారిగా ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఏమైనా ఫర్వాలేదు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారు.
దీంతో సదరు ఎంపీ వ్యవహారం మరింత వేడెక్కింది. ఆయన ఉంటారా? వెళ్లిపోతారా? అనే చర్చకు దారితీస్తోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆయనకు బీజేపీతో అవినాభావ సంబంధం ఉంది. నాయకులతో ఆయన టచ్‌లో నే ఉన్నారు. దీంతో ఆ ఎంపీ ఏ క్షణానైనా జంప్ చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.