శివరాత్రి రోజు జాగరణ ఎందుకు ? ఆ సమయంలో ఏం చేయాలి ?

-

శివరాత్రి అంటే విశ్వానికి వెలుగు ప్రసాదించిన రోజు. అంటే జ్యోతి స్వరూపమై ఆ మహాదేవుడు్ ఆవిర్భవించిన రోజు. ఈ రోజు ఆ తండ్రిని సేవించిన మనలోని జ్ఞాననేత్రం వికసిస్తుంది. అసలు ఈ రాత్రికి శివరాత్రి అనే పేరు రావడానికి కారణం ఈశాన సంహిత ఇంకో విధంగా చెబుతూ ఉంది.

శివుడు నేటి యర్థరాత్రి కాలాన కోటి సూర్యసమప్రభతో లింగాకారంతో పుట్టడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చిందని ఆ గ్రంథం పేర్కొంది. అర్థరాత్రి లింగోధ్భవకాలం. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత ఇది శివుడికి ప్రియకరమైందనీ, ఈనాడు లింగరూపి అగు శివుడికి పూజ జరపాలనీ శైవాగమం. ‘శివరాత్రి” పేరు రావడానికి ఇట్ల రెండు కారణాలు ఉన్నాయి. పూజ జరిపే కాలం విషయంలో రెండు వాదాలు లేవు. అన్ని గ్రంథాలు ఈనాటికి శివపూజ రాత్రే జరగాలని చెబుతున్నాయి. దేవపూజ పగటిపూజ కాక రాత్రిపూట సాగడం ఈ పండుగ యొక్క ప్రత్యేకతలలో ఒకటి. సాధారణంగా పండుగలు మృష్ణాన్న భోజనాలతో జరుగుతాయి. కాని శివరాత్రి ఉపవాసాల పండుగ. ఇది కూడా ఈ పండుగ ఒక్క ప్రత్యేకతే అని చెప్పవలసి ఉంటుంది. మహాశివరాత్రి వ్రతాచరణ విధానం లింగపురాణంలో వివరింపబడింది. శివరాత్రినాడు పగలు ఉపవాసము – రాత్రి జాగరణము. శివలింగార్చనము విధింపబడి ఉన్నాయి. ఉపవాస, జాగరణ లింగార్చనా రూపకమైన శివరాత్రి వ్రతం ఆచరిస్తే ఆ వ్రతం ఫలదాయకంగా ఉంటుందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. భక్తుల శివరాత్రి వ్రతాచరణ విధానం తెలుసుకోవాలి. వారు శివరాత్రికి ముందు దినం ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తారు. ఆ రాత్రి పవిత్రమైన స్థలంలో నిద్రపోతారు. శివరాత్రినాడు అరుణోదయాన్నే స్నానం చేస్తారు. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేస్తారు.

నాలుగు జాముల నాలుగు రకాల పూజలు !
శివరాత్రి పూట నాలుగు జాములు నాలుగు రకాలుగా స్వామిని అర్చించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆ విశేషాలు పరిశీలిద్దాం.. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాముల్లోనూ నాలుగు సారులు శివపూజచేయాలి.
మొదటిజాములో
శివుని పాలతో అభిషేకించాలి. పదార్థములులతో పూజ చేయాలి. పెసరపప్ప బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెట్టాలి. ఋగ్వేద మంత్రాలు చదవాలి.
రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి. తులసిదళాలతో శివుణ్ణి అర్చించాలి. పాయసం నైవేద్యం పెట్టాలి. యజుర్వేద మంత్రాలు పఠించాలి.
మూడవ జాములోనేతితో అభిషేకించాలి. మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. నువ్వుల పొడి కలసిన తినుబండారంనైవేద్యం పెట్టాలి. సామవేద మంత్రాలు చదవాలి.
నాల్గవ జాములో తేనెతో అభిషేకం చేయాలి. నీలోత్పలాలతో పూజించాలి. కేవలం అన్నం నైవేద్యం పెట్టాలి. అధర్వణ వేద మంత్రాలుచదవాలి. ఈ విధమైనపూజ శక్తికలవాళ్ళు ఇంటివద్దనే జరిపించాలి. అట్టి శక్తి లేనివాళ్ళు శివాలయాలకు వెళ్లి అక్కడ జరిగే ఇట్టి పూజను చూడాలి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news