మనదేశ జనాభా పది సంవత్సరాలకి ఒకసారి లెక్కిస్తారని అందరికీ తెలిసిందే. 2010 తర్వాత మళ్లీ 2020 లో జనగణన జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జనభా లెక్కలు ఈ సంవత్సరం ఉండేలా కనిపించడం లేదు. అనుకోని విధంగా కరోనా వచ్చి ప్లాన్లన్నింటినీ తారుమారు చేయడంతో జనాలంతా అయోమయంలో ఉన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులని చూస్తుంటే ఇల్లు దాటి బయటకి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. నెలన్నర పాటు లాక్ డౌన్ పెట్టినప్పటికీ కరోనా ఉధృతి తగ్గలేదు.
ప్రస్తుతం అన్ లాక్ దశలో ఉన్నాం. నాలుగవ అన్ లాక్ దశలో ఇక లాక్ డౌన్ అనే మాటే ఉండదని అన్నారు. మెట్రో రైళ్ళు మొదలవుతున్నాయి. ఇంకా చాలా వ్యాపారాలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జనగణన ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే కేంద్రప్రభుత్వం ఇప్పట్లో జనగణన చేపట్టే ఆలోచన చేయట్లేదని అంటున్నారు. జనాభా లెక్కల కార్యక్రమం కోసం సుమారుగా 30లక్షల మంది పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడి వారక్కడే ఇళ్ళలోకి వెళ్ళి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గనందున ఈ సంవత్సరం జనగణన చేపట్టరని చెబుతున్నారు.
2021లో ఈ కార్యక్రమం ఉంటుందట. ఒక సంవత్సరం ఆలస్యం అయినా ఫర్వాలేదు గానీ అనవసర రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. అంటే ఈ సంవత్సరం జరగాల్సిన జనాభా లెక్కలు 2021లో జరుగుతాయన్నమాట.