తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఒడిశా లో వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు.
వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని… తెలంగాణ పై దీని ప్రభావం శుక్ర, శనివారాల్లో ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు.విస్తారంగా వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. కుమురం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.