దుర్గాదేవికి అత్యంత ఇష్టమైన దసరా దేవీ నవరాత్రులకొనసాగుతున్నాయి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 26 నుంచి నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈరోజు మూడో రోజు. తొమ్మిది రోజులపాటు దుర్గా దేవిని భక్తులు వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ పండుగను భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా ఆలయాలు ఉన్నాయి..ఆ అలయాల విశేషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
గుహ ఆలయం..
మాతా వైష్ణోదేవి అమ్మవారు కొలువై వున్నారు.పురాతన దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఉంది. ఆలయం లోపల ఒక పెద్ద గుహ ఉంది, దాని లోపల నీరు కూడా నిండి ఉంటుంది. ఈ ఆలయంలో మీరు వైష్ణో దేవి దర్శనం పొందుతారు. చిన్న గుహలో కాత్యాయని, చింతపూర్ణి మరియు జ్వాలా దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ప్రస్తుతం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అందంగా అలంకరించారు. ఈ గుహాలయాన్ని ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ప్రీత్ విహార్‌లో ఉంది . దీనికి దగ్గరగా మెట్రో ప్రీత్ విహార్ (బ్లూ లైన్) ఉంది. ఈ ఆలయం మెట్రో నుండి 5 నిమిషాలలొ అక్కడికి చేర్చుకోవచ్చు..
ఛతర్పూర్ ఆలయం..
కాత్యాయనిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు.ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది. అందంగా నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశంలో రెండవ అతిపెద్ద సముదాయాన్ని కలిగి ఉంది. ఇక్కడ దసరా శరన్నవరాత్రులు సందర్భంగా జాగరణ కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత కాత్యాయని. ఇక్కడ కాత్యాయని దేవిని దసరా ఉత్సవాల సమయంలో భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. ఛతర్పూర్ ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో నుండి సమీప మెట్రో స్టేషన్ ఛతర్పూర్ వద్ద దిగాలి. ఈ ఆలయం ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్ నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి వెళ్లాలనుకునే వారు ఆటోలో లేదా 10 నిమిషాలు నడిచి ఆలయానికి చేరుకోవచ్చు..
ఢిల్లీలోనే దుర్గా మాత కి సంబంధించిన మహిమాన్విత మరో ఆలయం ఝండేవాలన్ ఆలయం . ఈ పురాతన ఆలయం ఢిల్లీలోని ఝండేవాలన్ రోడ్‌లో ఉంది. ఏడాది పొడవునా ప్రజలు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వస్తుంటారు. అయితే నవరాత్రుల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆదిశక్తికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, కోరికలు కోరుకుంటే, ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు. ప్రస్తుతం దుర్గా నవరాత్రుల ఉత్సవాల కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తులు విశేషంగా ఝండేవాలన్ ఆలయానికి చేరుకుని అమ్మవారిని పూజిస్తున్నారు. ఇక ఈ ఆలయానికి ఢిల్లీ లోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు..ఈ ఆలయాలలో ఏదైనా కోరుకుంటే కోర్కెలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం..