ఆకాశ్ అంబానీ ఫేక్​ ఐడీతో మహిళకు వల

-

రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ పేరుతో ట్విటర్​లో నకిలీ ఖాతా రూపొందించి మహిళకు టోకరా వేశాడు ఓ వ్యక్తి. ప్రీస్కూల్ మహిళా డైరెక్టర్​తో పరిచయం పెంచుకొని రూ.25 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన గుజరాత్​లోని సూరత్​లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధితురాలు సూరత్​లోని వెసు ప్రాంతంలో ప్రీ స్కూల్ నడుపుతోంది. ఆకాశ్​ అంబానీ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకున్న ఓ వ్యక్తికి, ఆమెకు సోషల్ మీడియా ద్వారా స్నేహం కుదిరింది. అయితే, ఐపీఎల్ బెట్టింగ్​లో కోట్లాది రూపాయాలు పోగొట్టుకున్నానని ‘ఫేక్ ఆకాశ్ అంబానీ’ ఆమెకు ఫోన్ ​చేసి చెప్పాడు. ఆ డబ్బులు తాను ఇంటి దగ్గర అడిగి తీసుకోలేనని చెప్పి.. కొంత నగదు పంపించమని అడిగాడు. అది నమ్మిన ఆమె విడతలవారీగా రూ.25 లక్షలను అతడి ఖాతాలో వేసింది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఆకాశ్ ఫ్రెండ్​నని పరిచయం చేసుకొని సచిన్ హాల్వాయ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్​ చేశాడు. సూరత్​లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు తమకు రూ.50 లక్షలు కావాలని చెబుతూ ఆమె​ను డబ్బు అడిగాడు. అనుమానం వచ్చిన ఆమె సచిన్​తో మాట్లాడటం మానేసింది.

అంతకుముందు మహిళ పంపించిన న్యూడ్ ఫొటోలను ఆసరాగా చేసుకొని ఆమెను బ్లాక్​మెయిల్ చేశాడు సచిన్. డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. ఫొటోలను అమెరికాలో ఉంటున్న బంధువులందరికీ పంపిస్తానని మెసేజస్, మెయిల్స్ పంపించాడు. ఈ వ్యవహారంపై ఆమె సూరత్​లోని వేసు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీని ట్విటర్ నుంచి తొలగించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news