వర్క్ ఫ్రం హోం ప్రసక్తే లేదు.. ఆఫీసుకు రావాల్సిందే.. ఐటీ కంపెనీల అల్టిమేటమ్

-

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ప్రజల జీవన అలవాట్లను మార్చేసింది. ఏళ్ల తరబడి ఇంటికి దూరంగా ఉన్నవాళ్లను ఏకంగా రెండేళ్లు ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. ముఖ్యంగా ఎప్పుడూ బిజీగా ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మొదటిసారిగా ఇంటిపట్టున ఉన్నారు. అదికూడా రెండేళ్ల నుంచి. రెండేళ్లు ఇంటి వాతావరణానికే అలవాటుపడిన వాళ్లు.. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లాలంటే బద్ధకిస్తున్నారు. వర్క్ ఫ్రం హోంతో ఎన్ని లాభాలున్నాయో అర్థమయ్యాక ఇక కార్యాలయాలకు వెళ్లాలంటే ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం త్వరగా ఆఫీసుకు రావాల్సిందేనని ఆర్డర్ వేస్తున్నాయి. మరి ఆ కంపెనీలు ఏంటో చూద్దామా..

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల కొన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యాయి. ఇక నుంచి కార్యాలయాల నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. దీనికి నాంది ఆపిల్ సంస్థ పలికింది. ఆపిల్ లాంటి పెద్ద కంపెనీ తన ఉద్యోగులందరినీ ఆఫీస్‌కి పిలిచిన తర్వాత ఇప్పుడు ఇండియాలోని మరికొన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు పిలవాలని డిసైడ్ అయ్యాయి.

ఆర్‌పీజీ గ్రూప్

ఇటీవల ఆర్‌పీజీ గ్రూప్ ప్రెసిడెంట్ హర్ష్ గోయెంకా లింక్డ్‌ఇన్‌లో కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇంటి నుంచి పని చేయడం ఇకపై ఆచరణీయమైన దీర్ఘకాలిక ఎంపిక కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం.. ఆర్‌పీజీ గ్రూప్ తన ఉద్యోగుల్లో సగం మందిని హైబ్రిడ్ మోడ్‌లో పని చేయడానికి అనుమతిస్తోంది. మరికొద్ది రోజుల్లో అందర్ని ఆఫీసు నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేయనుంది.

విప్రో..

కొవిడ్ మహమ్మారి కారణంగా విప్రో ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించారు. అయితే వర్క్ ఫ్రం హోం వదిలి ఆఫీస్ రావాలని తాము ఒత్తిడికి గురి చేయడం లేదని.. కానీ ఎప్పటికైనా ఆఫీసుకు రాక తప్పదని.. త్వరలోనే పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్ కొనసాగిస్తామని ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ అన్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల్లో 20% మంది తిరిగి విధుల్లో చేరారు. హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా.. తాము రిటర్న్-టు-ఆఫీస్ మోడల్‌ను కొనసాగిస్తామని అని టీసీఎస్ సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.

టెక్ మహీంద్రా..

కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ ఉద్యోగులను ఆగస్టు నుంచి వారంలోని అన్ని పని దినాల్లో కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. జులై వరకు.. కంపెనీ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా కార్యాలయం నుంచి పని చేయడానికి అనుమతించిన టెక్ మహీంద్రా ఈ నెలలో మాత్రం తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది.

కరోనా నుంచి ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ఈ తరుణంలో రెండేళ్లు ఇంటికే పరిమితమైన టెక్కీలు ఇప్పుడు ఆఫీసు బాట పట్టాలంటే అనాసక్తి చూపుతున్నారు. మరోవైపు ఎప్పటికైనా కార్యాలయాలకు రావాల్సిందేనని కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే హైబ్రిడ్ విధానం మొదలుపెట్టి ఐటీ సెక్టార్.. మరికొద్ది రోజుల్లో ఉద్యోగులందరిని ఆఫీసులకే రమ్మని అల్టిమేటమ్ జారీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news