మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా విలయ తాండవం చేస్తుందని, ప్రస్తుతం ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) హెచ్చరించింది. లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా తగ్గకపోవడంపై ఆ సంస్థ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆధనమ్ ఘెబ్రెయిసస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 1.50 లక్షల కొత్త కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయని, ఇది అత్యంత ఆందోళనకు గురి చేసే విషయమని అన్నారు. అనేక కొత్త కరోనా కేసుల్లో చాలా వరకు అమెరికా, దక్షిణ ఆసియా, అరబ్ దేశాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించిందని, అనేక మంది ఇండ్లకే పరిమితమై తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దేశాలు తిరిగి ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధ పడుతున్నాయని టెడ్రోస్ అన్నారు. కరోనా వైరస్ ప్రస్తుతం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, అనేక మందికి ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని అన్నారు. ప్రజలు ఈ వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.