ఎవరైనా అప్పులు చేస్తే.. ఏం చేస్తారు.. ఏదైనా వస్తువు కొనడమో.. ఇల్లు కొనడమో.. లేదా పెళ్లిచేయడమో చేస్తారు. ఇది సాధారణ కుటుంబాల్లో జరిగే చర్యలు. మరి ప్రభుత్వాలు అప్పులు చేస్తే.. ఏదైనా ప్రాజెక్టుకు లేదా కార్యక్రమానికి లేదా రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తారు. సాధారణంగా ఇలానే జరుగుతుందని అనుకుంటారు. పోనీ.. అది కూడా కాకపోతే.. ప్రజలకు ఏవైనా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. కానీ, ఏపీలో ఐదేళ్లు పాలించిన టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో వింత వైఖరి అవలంబించారు. ఇలాంటి పనులు ఆయన తప్ప ఎవరూ చేయలేరనే రేంజ్‌లో దూసుకుపోయారు. ఇప్పుడు వీటిపైనా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) దుమ్మెత్తి పోసింది.
టీడీపీ హయాంలో అప్పులు, ప్రజాధనం దుర్వినియోగం భారీగా చేసినట్టు కాగ్ తాజాగా వెలువరించిన తన నివేదికలో తూర్పార బట్టింది. 2015-16, 2017-18 మధ్య కాలంలో ఆర్థిక లోటును అదుపు చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని కాగ్ పేర్కొంది. అప్పులు చేయడం ద్వారా దేనిపైనైనా పెట్టుబడులు పెట్టాల్సిన ప్రభుత్వం ఈ ప్రధాన సూత్రాన్ని పక్కన పెట్టిందని కాగ్ తప్పుబట్టింది. పాత అప్పులు తీర్చేందుకు కొత్తగా అప్పులు చేసిందని, ఫలితంగా ప్రజలపై 2018, మార్చి 31 నాటికి 2,23,706 కోట్ల మేరకు అప్పుల భారం పడిందని కాగ్ తన నివేదికలో వివరించడం ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబును తీవ్రస్థాయిలో ఇరుకునపెట్టనుందని అంటున్నారు పరిశీలకులు. తీసుకున్న రుణాలతో పోలిస్తే.. తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్ఫత్తి 2016-17లో 18.27శాతం నుంచి 2017-18లో 22.51 శాతానికి పెరిగినట్టు కాగ్ వివరించింది.
కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చేందుకు మళ్లించారని, దీనివల్ల రానున్న సంవత్సరాల్లో తీర్చాల్సిన రుణ భారం.. 91,599.32 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రిజర్వు బ్యాంకు నుంచి పొందిన ఓవర్ డ్రాఫ్ట్‌ను సకాలంలో చెల్లించక పోవడంతో వడ్డీ భారం పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం పడిందని పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా ఆస్తులను సృష్టించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని కాగ్ తప్పుబట్టింది. 2017-18లో 231 రోజులు వేస్ అండ్ మీన్స్, వోవర్ డ్రాఫ్ట్ ల భారం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది.
పలు ఆర్ధిక సంస్థల వద్ద చేసిన అప్పులు సైతం చాలక పోవడంతో రిజర్వు బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో 45,86,075 కోట్ల రూపాయలను తీసుకున్నట్టు కాగ్ వివరించింది. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో 44.31 కోట్ల వడ్డీని కట్టాల్సి వచ్చిందని వివరించింది. మొత్తంగా ఈ పరిణామాలు రాజకీయంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకు మరిన్ని ఆయుధాలు అందించేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.