పంజాబ్: ది గ్రేట్ ఖలీకి మాతృవియోగం కలిగింది. ఖలీ తల్లి తాండి దేవి (75) లుధియానాలోని దయానంద్ మెడికల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అవయవాల సమస్యతో ఆమె కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను బతికేందుకు వైద్యులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఆదివారం రాత్రి తాండిదేవి చనిపోయారు. అవయవాలు పని చేయకపోవడంతో చికిత్సకు ఆమె శరీరం సహకరించలేదని వైద్యులు తెలిపారు.
ది గ్రేట్ ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. ఆయన 1972 ఆగస్టు 27న జన్మించారు. పంజాబ్‌లో పోలీస్ అధికారిగా పని చేశారు. రెజ్లింగ్‌లో ఆయనను ది ఖలీగా పిలుచుకుంటారు. సినిమాల్లో కూడా నటించారు. నాలుగు హాలీవుడ్, రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. చాలా టీవీ షోల్లో కూడా ఆయన కనిపించారు. 2000లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్‌గా ప్రపంచ గుర్తింపు పొందారు. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నారు.