దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. 140 రోజుల తర్వాత దేశంలో అత్యధికంగా 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సాకాగ్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 344 కేసులు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడైంది.
దేశంలో మొదటిసారిగా ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించి 2 కేసులు జనవరిలో బయటపడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ సంఖ్య వందల్లోకి చేరినట్లు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం వెల్లడించింది. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 నమూనాల్లో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ బయటపడినట్లు ఇన్సాకాగ్ తెలిపింది.
ఈ వేరియంట్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 105 బయటపడగా.. తెలంగాణలో 93, కర్ణాటకలో 57, గుజరాత్ 54 కేసులు తేలాయి. కొవిడ్ తాజా విజృంభణకు కొత్త వేరియంట్ కారణమై ఉండొచ్చని.. అయినప్పటికీ తీవ్రమైన జబ్బు, మరణానికి దారి తీయనంతవరకు భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు.