చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ త్వరలో కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షియోమీ తన సొంత కార్‌ను త్వరలోనే తయారు చేసి మార్కెట్‌లో ప్రవేశపెడుతుందని తెలిసింది. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇప్పటికే చెప్పుకోదగిన షియోమీ అనేక రంగాల్లోనూ తనదైన ముద్రను వేసింది. ఈ క్రమంలోనే త్వరలో కార్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఐఫెంగ్‌న్యూస్ రిపోర్టు ప్రకారం.. షియోమీ కార్ల తయారీకి కావల్సిన అన్ని వనరులను, అవకాశాలను సమకూర్చుకుంటుందని తెలిసింది. ఈ ప్రాజెక్టుకు షియోమీ ప్రస్తుత సీఈవో లెయ్ జున్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. జున్ 2013లోనే టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్‌ను కలిశారు. అయితే ప్రస్తుతం షియోమీ కార్లను తయారు చేస్తుందని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
షియోమీ మొదట్లో కేవలం ఫోన్లను మాత్రమే ఉత్పత్తి చేసేది. కానీ తరువాత టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇక త్వరలో కార్లను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. అయితే ఆ కార్లు ఎలా ఉంటాయి ? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై షియోమీ ఇంకా అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కానీ త్వరలో వివరాలు తెలిసే అవకాశం ఉంది.