కేంద్ర ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గౌరవప్రధ రాష్ట్రపతి ఎన్నికలను కెసిఆర్ అగౌరవిస్తున్నారని, బైక్ ర్యాలీ నిర్వహించి ఆ హోదాను తగ్గించేలా కెసిఆర్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. యశ్వంత్ సిన్హా గెలిచేది లేదు.. ఏం లేదు.. ర్యాలీలతో ఆర్భాటం చేయడం అవసరమా? అని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడే ర్యాలీలు చెయ్యని కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు ర్యాలీలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని.. దాన్ని కాపాడుకోవడం పై కేసీఆర్ దృష్టి పెడితే మంచిది అని సూచించారు. కెసిఆర్ తీరు వల్లే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పంజాబ్ వెల్లి రైతులకు మూడు లక్షలు ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకు సాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన రైతు ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బండి సంజయ్.