జగన్ ను నిండా ముంచిన వైసీపీ క్యాడెర్…

-

ఏపీలో పంచాయితీ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం కారణంగానే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ విషయమే అనేక అనుమానాలకు దారితీస్తోంది. అసలు ఎన్నికల వాయిదా పడటానికి కరోనా కారణమా లేక గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న విధ్వంసాలు కారణమా అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం రాష్ట్రంలో అలజడులు జరిగిన ప్రాంతాలో అధికారులపై ఈసీ వేటు వేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన గొడవలను సీరియస్ గా తీసుకున్న ఈసీ అక్కడ ఎస్పీలను విధుల నుంచి తప్పించి వేరే వారిని నియమించాలని ఆదేశించింది…

ఇదంతా పక్కనబెడితే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా ఈసీ తనకు తానుగా ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సీఎం వైఎస్ జగన్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే తన షెడ్యూల్ సైతం మార్చి గవర్నర్ తో భేటీ అయ్యారు. తనకు చెప్పకుండా ఈసీ ఎలా ఈ నిర్ణయానికి వచ్చిందంటూ సీఎం గవర్నర్ కు వివరించారు. దీన్నిబట్టి చూస్తుంటే అధికార పార్టీ నేతలు దారుణాలకు ఒడిగట్టారని చెప్పకుండా పోలీసులపై ఈసీ వేటు వేసింది. అంటే రాష్ట్రంలో గొడవలు జరిగిన ప్రాంతంలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పకనే చెప్పినట్టు అయింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వైసీపీ నేతలు ఇష్టారీతిన రెచ్చిపోయారనే చెప్పాలి. ఎందుకంటే సీఎం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని సైతం ఇష్టారీతిన ఉల్లంఘించారు. ఇతర పార్టీల నేతలను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపై దాడులు చేసి వారి నామినేషన్ పత్రాలను సైతం ఎత్తుకెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు చేసిన పనులన్నీ కూడా మీడియాలోనూ , సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయ్యాయి. వారం రోజులుగా అధికార పార్టీ నేతల నుంచి టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీ నేతలకు 180 బెదిరింపుల వచ్చాయని ప్రతిపక్ష పార్టీల నుంచి ఆరోపణలు ఎదురయ్యాయి. ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగం ఈ వీడియోలను బాగా వైరల్ చేశాయి. దీంతో అధికార పార్టీ నేతల్లోనే సొంత పార్టీపై అసహనం వ్యక్తమయింది.

వీటన్నింటిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి సుమారు 138 ఫిర్యాదులు చేశారు. విపక్ష పార్టీల నుంచి 200 కు పైగా పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్నికల సంఘంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో కరోనాను వంకగా చూపించి ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది.

వైసీపీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు సీఎం జగన్ కు పేరుకి కళంకం తెచ్చి పెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజల్లో వైసీపీ పై వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నేతలు తమ పద్దతిని మార్చుకోకపోతే వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news