సొంత అనుచరుల తిరుగుబాటు..షాక్ లో ఆ వైసీపీ ఎమ్మెల్యే

-

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం పెద్ద చర్చగాకే దారి తీస్తుంది.సొంత పార్టీ కార్యకర్తల నుండి ఎదురౌతున్న వ్యతిరేకత ఏకంగా కరపత్రాల ప్రచారం స్థాయికి వెళ్లడంతో షాక్ కు గురయ్యారు దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ఎమ్మెల్యే వ్యవహరం చివరికి అధిష్టానానికి చేరడం అధిష్టానం ఆరాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయ అంశంగా మారాడు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాట్ టాపిక్ గా మారారు. విద్యారంగంలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఓటమిపాలయ్యారు. ఆతరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న మద్దిశెట్టి పదేళ్ల తరువాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో దర్శి వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న మద్దిశెట్టి వేణుగోపాల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందిన మద్దిశెట్టి వేణుగోపాల్ ని వివాదాలు అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. దీంతో నియోజక వర్గంతో పాటూ జిల్లా రాజకీయాల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ చర్చగా మారుతున్నారట.

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి ముఖ్య అనుచరుడిగా ఉన్న శ్రీహరి అనే యువకుడు గత ఏడాది ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. కోటి రూపాయలు విలువైన తన ఇంటిని ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ మీడియాని ఆశ్రయించాడు. ముఖ్య అనుచరుడే ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేయడంతో మద్దిశెట్టి వ్యవహారం అప్పట్లో చర్చగా మారింది. తాజాగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పై సొంత పార్టీ కార్యకర్తలు నియోజక వర్గంలో కరపత్రాలు వేయడం తీవ్ర చర్చగా మారింది. నర్సారావుపేటలో కోడెల శివప్రసాద్ కుటుంబం లాగే దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ కుటుంబం కూడా అరాచరాలు చేస్తుందని కరపత్రాల్లో ముద్రించారు.

నియోజక వర్గంలో జరిగే పనుల్లో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నియోజక వర్గంలో ఉన్న చెరువుల్లో చేపలు పట్టేందుకు కూడా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని, నియోజక వర్గంలో మండలానికి ఒక అనుచరుడిని పెట్టి కమీషన్లు వసూలు చేస్తున్నారని … వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టి టీడీపీ నాయకులకు పనులు ఇచ్చి భారీగా కమీషన్లు దండుకుంటున్నారని కరపత్రాల్లో దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై కరపత్రాలు వేయడం దర్శితో పాటూ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేపై కరపత్రాలు వేయడాన్ని పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుందట. నియోజక వర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అధికార పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారట. కరపత్రాలు ఎవరు వేశారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి రోడ్డెక్కడంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గంతోనూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్న ఎమ్మెల్యేని ఈ వ్యవహారాలన్ని షాక్ కి గురి చేస్తున్నాయట. నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ నుండి ఎదురౌతున్న వ్యతిరేకతని ఎమ్మెల్యే మద్దిశెట్టి ఎలా సరిచేసుకుంటారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news