ఏపీలో ఇటీవల ఆరుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇచ్చింది అధికార వైసీపీ. ఆ జాబితాలో ఉన్న కొన్న పేర్లు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచాయట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కావడంతో ఒక్కటే చర్చ జరుగుతోంది. వివిధ సమీకరణాల్లో భాగంగా విజయవాడ సిటీలో మాజీ కార్పొరేటర్ కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న అధికారపార్టీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ముందుగా జాబితాలో పేరు చూసిన తర్వాత ఎవరామె అని ఆరా తీశారు పార్టీ నేతలు. పెద్దగా ప్రచారంలో లేని నాయకురాలు కావడంతో పార్టీ వర్గాలతోపాటు బెజవాడలోని ముస్లిం సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలను ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచిందట. పార్టీ కరీమున్నీసా పేరు ప్రకటించినంత వరకు బాగానే ఉన్నా.. ఈ నిర్ణయం రుచించని వైసీపీలోని ముస్లిం నేతలు ఇప్పుడిప్పుడే నిరసన రాగాలు అందుకుంటున్నట్టు సమాచారం. ఇంట్లో కూర్చున్న మహిళా నేతను పిలిచి అవకాశం ఇచ్చారు సరే.. మరి ఇన్నాళ్లు జెండా పట్టుకుని రోడ్డెక్కి పనిచేసిన మాకేంటి అని హైకమాండ్‌ను అడుగుతున్నారట.
ఒకవైపు బెజవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహంలో వైసీపీ నేతలు తలమునకలై ఉంటే.. మరోవైపు ఈ కొత్త రగడపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజికవర్గం జనాభా ఎక్కువ. ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. అందుకే ఇక్కడి ముస్లిం సామాజికవర్గాన్ని పార్టీలు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉండటంతో.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారట పార్టీ పెద్దలు.
అసలే మున్సిపల్ ఎన్నికల కాలం.. ఈ సమయంలో ఈ సున్నితమైన అంశాన్ని ఎలా డీల్ చేయాలా అని మదనపడుతున్నారట పార్టీ పెద్దలు. ఈ ప్రాంతంలో ముస్లిం సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న ఒకరికి పదవిపై హామీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.