ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు – ఏపీ సర్కార్ కు మధ్య ఉన్న విభేదాలో, మరొకటొ మరొకటో… ఆ సంగతులపై వారు హైకోర్టు – సుప్రీంకోర్టుల మధ్య తేల్చుకోనున్నారు అన్న సంగతి కాసేపు పక్కన పెడితే… అసలు నిమ్మగడ్డ వ్యవహారంలో టీడీపీకి ఉన్న ప్రత్యేక ఆసక్తి ఏమిటి అనేది ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్న సందేహం! సరిగ్గా అలోచిస్తే… ఈ సందేహం కరెక్టే అనిపించకమానదు! ఇదే విషయాలపై వైకాపా ఎమ్మెల్యే అప్పలరాజు తనకున్న ఈ సందేహంతోపాటు మరికొన్ని విషయాలు వెళ్లబుచ్చుతూ కొన్ని ప్రశ్నలు సందిస్తున్నారు!
నిమ్మగడ్డ మీద టీడీపీ నేతలకు ఉన్న ఆసక్తి, నిమ్మగడ్డ వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటి? ఆయన్నే కొనసాగించాలని వారు అడగడంలో అర్థం ఏమిటి? నిమ్మగడ్డకు, టీడీపీకి ఉన్న సంబంధమేంటి? అని ప్రశ్నిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సీదిరి అప్పలరాజు. ప్రజాహిత కార్యక్రమాలను అమలు పర్చకుండా కోర్టులు ఆటంకపర్చడం తమకు ఆమోదంయోగ్యం కాదు అని చెబుతున్న అప్పలరాజు.. కోర్టు తీర్పులతో మేము ఏకీభవించడం లేదు అని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితి వస్తుందని… అదే జరిగితే అప్పుడు 44 మందికికాదు… 4 కోట్ల మందికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
శాసనవ్యవస్థలోకి నేడు కోర్టులు ప్రవేశిస్తున్నాయని, ఇంగ్లిష్ మీడియం, పేదలకు ఇళ్లు, కొన్ని కార్యాలయాల తరలింపును సైతం కోర్టులు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడు కొన్ని కేసులను సుమోటోగా తీసుకుంటున్న హైకోర్టు, గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు! తన ఆవేదనపై మరింత క్లారిటీ ఇచ్చిన ఆయన… “ప్రజల అభీష్టానికి అనుగుణంగా కోర్టు తీర్పులు ఉండాలని కాని, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే తీర్పు ఇవ్వాలని కాని తాము అడగడం లేదని.. కానీ, కోర్టు తీర్పులు ప్రజాహితంగా ఉండాలని మాత్రం తాము అడుగుతున్నామని” తెలిపారు!