ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి, ఎమ్మెల్యే ఆర్ధర్ కి మధ్య రాజకీయ విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గత కొన్నాళ్ళుగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకునే పరిస్థితి నెలకొంది.
యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గాన్ని నియమించారని, గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించగా ఛైర్మన్ పదవి ఆయనకు దక్కలేదు. దీనితో ఇప్పుడు ఆర్ధర్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానం దృష్టికి ఆయన బైరెడ్డి తో ఉన్న విభేదాలను తీసుకు వెళ్ళారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలోనే ఆయన రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అటు పార్టీ వర్గాలు కూడా ఇప్పుడు ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డాయి. అసలు ఎమ్మెల్యే రాజీనామా చెయ్యాల్సి రావడం ఏంటీ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పుడు ఆరా తీసినట్టు సమాచారం. ఏది ఎలా ఉన్నా ఈ వ్యవహారం ఇప్పుడు సీరియస్ గా మారింది.