అతుకుల బొంత గా ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి మొదలయింది. ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉందని ప్రచారం నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు తోక జాడించడం మొదలుపెట్టారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.
తాజాగా ఒక ఎమ్మెల్యే కనపడకుండా పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్లే బిసహులాల్ సింగ్ గత మూడు రోజులుగా కనిపించకకుండా పోయారు. దీనిపై ఆయన కుమారుడు తేజ్‌భాన్ సింగ్ భోపాల్‌లోని టీటీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనుప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బిసహులాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు బలమైన నేతగా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో మంచి పలుకుబడి ఉంది.
ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తండ్రి అప్పట్నించీ కనిపించకుండా పోయారని, ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న రాయ్‌పూర్‌కు బిసహులాల్ వెళ్ళారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ డాంగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనితో కమల్ నాథ్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఆయన ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు.