ఏపీలో అధికార పార్టీ ఆమరణ దీక్షకి దిగిన సంగతి తెలిసిందే. ఈ అంశం కాస్త చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఆంధ్రా పేపరుమిల్లు యాజమాన్యం పలువురు ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం పర్మనంట్ చేయడానికి అంగీకరించడంతో రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీపీఎం కార్యదర్శి అరుణ్ లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించారు.
పేపరు మిల్లు వద్ద గడిచిన 24 గంటలుగా ఈ నిరవధిక దీక్ష కొనసాగింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 84మంది కార్మికులను ఇన్‌ప్లాంట్ ట్రైనీలుగా, 55మందిని బదిలీలుగా సీనియార్టీ ప్రకారం తీసుకోవడానికి ఒప్పందం జరిగింది. దీంతోపాటు కోర్ విభాగంలో మరో 55మందిని సీనియార్టీ ఆధారంగా పర్మినెంట్ చేయడానికి జరిగిన ఒప్పందాన్ని పేపరుమిల్లు యాజమాన్యం అంగీకరించింది. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.