యోగ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం.
దాన్ని సద్వినియోగ పరుచుకున్నప్పుడు..
మనుషులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
ఉరుకుల పరుగుల జీవితాన్ని కాస్త నెమ్మదిపరిచి..
యోగతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోండి..
ప్రపంచాన్ని శాసిస్తున్న ఫిట్‌నెస్ ట్రెండ్స్‌లో మొదటగా యోగాను చెప్పుకోవచ్చు. హధ యోగను రకరకాల పేర్లతో మార్చి మారేడుకాయను చేసి యోగ యోక్క ఉద్దేశం తప్పుదారి పడుతుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు కాకుండా యోగ ఒక్క ఆసనాలకు మాత్రమే పరిమితమవడం దురదృష్టం.
యోగ అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టీనేజ్ పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దీనిని మార్పులు చేసుకొని వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా అందరినీ ఒక్కగాటన పడవేసి చేయించినట్లయితే లాభాలతో పాటు నష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. ఒక మనిషి వయస్సు, వారు ఉన్న వృత్తి, ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక పద్ధతిలో ప్లాన్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
బీర్ యోగా, గోట్ యోగా, న్యూడ్ యోగా, ఇలా రకరకాల పోకడలతో యోగ సారాన్ని.. నిస్సారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మనిషి తనతో, తన చుట్టూ ఉన్న మనుషులతో, తన సరిసరాలతో ఒక సమన్వయంతో జీవించగలగడానికి యోగను ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. యోగాను కేవలం జబ్బులు వచ్చినప్పుడు తగ్గించడానికో లేదా కేవలం ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికో కాకుండా ఆసనం, ప్రాణాయామం, మనం మానసికంగా స్థిర చిత్తంతో ఉండేలా, ఒడిదుడుకులను తట్టుకొని జీవితంలో ఇంకొకరికి ఆలంబనగా ఉండేలా ఉపయోగపడుతాయి.
– సంగీత అంకత
యోగా ట్రైనర్