మద్యం సేవించడం అనేది ఒకప్పుడు అలవాటు. కానీ అదిప్పుడు వ్యసనంగా మారింది. కారణాలేమున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య ఏటా పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. హైదరాబాద్ నగరంలో తాజాగా చోటు చేసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు షాక్‌ను కలిగిస్తున్నాయి.
గడిచిన 12 గంటల్లో హైదరాబాద్ నగరంలో 255 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం విశేషం. వాటిల్లో గచ్చిబౌలిలో 51, మాదాపూర్‌లో 46, ఆల్వాల్‌లో 34, జీడిమెట్లలో 17, మియాపూర్ 16, రాజేంద్ర నగర్ 16, శంషాబాద్‌లో 15 కేసులు నమోదయ్యాయి. ఇక బ్రీత్ అనలైజర్ రీడింగ్ 50 నుంచి 99 పాయింట్ల మధ్యలో 55 మందికి వచ్చింది. అలాగే 51 మంది రీడింగ్ 100-149 పాయింట్ల మధ్యలో రాగా, 40 మంది రీడింగ్ 200 నుంచి 299 పాయింట్ల మధ్య నమోదైంది. మరో 73 మంది రీడింగ్ 300 నుంచి 500 పాయింట్ల మధ్య నమోదైంది.
అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ వారిలో యువతే ఎక్కువగా ఉండడం విశేషం. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో 55 మంది తనిఖీల్లో పట్టుబడగా 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఏకంగా 112 మంది పట్టుబడ్డారు. మరో 13 మంది వయస్సు 36 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంది. కేవలం కొంత నిర్ణీత సమయంలోనే ఇంతటి భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం షాక్‌ను కలిగిస్తోంది. గతంలోకన్నా ప్రస్తుతం అధిక శాతం మంది మద్యం సేవిస్తున్నారని ఈ గణాంకాలను చూస్తే మనకు స్పష్టమవుతుంది. ఇక ఇది ఇలాగే కొనసాగితే మద్యం తనిఖీల్లో ఇంకా పెద్ద ఎత్తున మందు బాబులు పట్టుబడడం ఖాయంగా కనిపిస్తోంది.