తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన పలు కీలక ఎనిమిది బిల్లులు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్ లో అసెంబ్లీ, మండలి లో ఆమోదం పొందగా వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. నాలుగు నెలలు గడిచిన గవర్నర్ ఆమోదం తెలపలేదు. తాజాగా ఇదే విషయంపై స్పందించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. యూనివర్సిటీలో నియామకాలపై బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు బాల్క సుమన్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. మరోవైపు గవర్నర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుకు ఆమోదం చెప్పడం లేదని.. నెలల తరబడి బిల్లును పెండింగ్ లో పెట్టడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం చేయాలని అనుకుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో యువత ఆగ్రహంతో ఉందన్నారు. గవర్నర్ పెండింగ్ బిల్లుపై ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందన్నారు.