ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మాటంటే మాటే అని.. ఇచ్చిన మాట విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గనని నిరూపించుకున్నాడు. జగన్ మరోసారి మొండిఘటం అని ఫ్రూవ్ అయ్యింది. జగన్ ముందు నుంచి ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కు తగ్గరన్నది తెలిసిందే. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ ముందు నుంచి ఒకే పట్టు మీద ఉన్నాడు. గతంలో అభివృద్ధి కేంద్రీకరణ జరగడం వల్లే రాష్ట్రాలు విడిపోయాయని.. ఈ రోజు ఏపీలో ఆ పరిస్థితి ఎప్పటకీ రాకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజధానిని మూడు ప్రాంతాలలో పెట్టడంతో పాటు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.
జగన్ గత డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటన చేసినప్పటి నుంచే తెలుగుదేశంలో పెద్ద అలజడి రేగింది. అమరావతిని తాము తలకు ఎత్తుకోకపోతే తమ కుంచుకోటలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇది పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అవుతుందని భావించింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా అమరావతిలో ఓ ఉద్యమం అయితే నడుస్తోంది. ఈ ఉద్యమం ఊసు లేకపోయినా తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయినా అక్కడ హడావిడే తప్పా నిజంగా జనాల్లో ఉద్యమ వేడి కనిపించడం లేదన్నది వాస్తవం. ఓ వైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్ నిర్ణయం వైసీపీకి కాస్త మైనస్ అవుతుందని పార్టీ నేతలు చెపుతున్నా జగన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డారు.
రాజధానుల తరలింపు వ్యవహారం ఇప్పటకీ కోర్టుల్లో లేకపోతే ఈ పాటికే ఈ పక్రియ పూర్తయ్యి ఉండేది. తాజాగా ఇదే అంశంపై జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్ మరోసారి తన అభిప్రాయం కుండబద్దలు కొట్టేశారు. రాజధాని ఒకే చోట ఉంటే అన్ని ప్రాంతాలు ఎలా అభివృద్ది చెందుతాయని ప్రశ్నించారు. అమరావతి భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన జగన్… మూడు రాజధానులతోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా, అమరావతి ప్రాంతలో పార్టీ నేతల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఏ మాత్రం వెనక్కు తగ్గక తాను ఎంత మొండి ఘటాన్నో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. జగన్ ఉడుం పట్టు పడితే ఎలా ఉంటుందో ? మరోసారి ఏపీ రాజకీయ నేతలకు బాగా తెలిసొచ్చినట్లు ఉంది.
-vuyyuru subhash