దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనిస్తున్నారా..? మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను, ఆయన చేపడుతున్న పనులను నిశితంగా గమనిస్తూనే, వారిని ఫాలో అవుతూ జగన్ ముందుకు సాగుతున్నారా…? నరేంద్రమోడీ చేపడుతున్న పనులను జగన్ తూచ తప్పకుండా చేసేందుకే నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవునో కాదో తెలియదు కానీ. ప్రస్తుతానికి మాత్రం ఓవిషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం జగన్ ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. ఇంతకు ఏపీ సీఎం జగన్ పీఎం నరేంద్రమోడీని ఏ విషయంలో అనుకరిస్తున్నారంటే.. పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ సంకల్పించారట.
మరి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు పీఎం నరేంద్రమోడీని అనుసరించడానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే నరేంద్రమోడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఇంతకు ఈ విగ్రహం ఎవరిదో చెప్పలేదు కదూ.. ఉక్కుమనిషిగా కీర్తించబడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. నరేంద్రమోడీ నర్మదా నది మధ్యలో 182 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పారు. దీనికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని నామకరణ చేసి గతంలోనే పటేల్ జయంతి రోజున ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది.
ఆమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టిని గుర్తుకు తెచ్చెలా పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇది పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. అయితే ఇప్పుడు ఏపీ సీఎం కూడా తన తండ్రి, దివంగత సీఎం, మహానేతగా జలయజ్ఞ ప్రధాతగా ప్రజల చేత కీర్తించబడుతున్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద నెలకొల్పాలని సంకల్పించారు. పటేల్ అంత విగ్రహం కాదు కానీ 45 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఆహ్లాదం పంచేందుకు పార్కు, వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు సన్నహాలు ప్రారంభించారట. అందుకు తగిన విధంగా సరైన స్థలం చూడాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు మంత్రి అనిల్ ఆదివారం రోజున పులిచింతలకు తోటి మంత్రి పేర్ని నానీతో కలిసి వెళ్ళి స్థలపరిశీలన చేసి వచ్చారు. పులిచింతల ప్రాజెక్టు ఏపీ, తెలంగాణలకు నడుమ ఉంటుంది. ఈ మహానేత దివంగత వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎంగా పలు సంక్షేమ పథకాలు చేయడమే కాకుండా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.. సో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని అనుసరిస్తున్నారనే అర్థం…