బీసీలపై జ‌గ‌న్ మ‌రో అస్త్రం… స్కెచ్ అంతా రెడీ…!

-

త‌న‌దైన శైలిలో అధికారం ద‌క్కించుకుని, ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్న జ‌గ‌న్‌.. అనేక ప‌థ‌కాల‌ను ఇప్ప‌టికే ప్ర‌వేశ పెట్టారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు తోడు న‌గ‌దు ప‌థ‌కాల‌ను కూడా ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చి ఎనిమిది మాసాలు గ‌డిచేస‌రికి నెల నెలా ఏదో ఒక కార్య‌క్ర‌మం, ప‌థ‌కంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఆదిలోనే రైతు భ‌రోసాను తీసుకువ‌చ్చారు. ఆవెంట‌నే వైఎస్సార్ అభ‌య హ‌స్తం పేరుతో ఆటో డ్రైవ‌ర్ల‌కు, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చా రు. పింఛ‌న్ల‌ను ఏడాదికి రూ.250 చొప్పున పెంచేకార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

ఇక‌, జ‌న‌వ‌రి 9న ప్రారంభించిన అమ్మ ఒడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఇక‌, ఆరోగ్య శ్రీని అంద‌రికీ చేరువ చేసే కార్య‌క్ర‌మం చేశారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌మీడియంను ప్ర‌వేశ పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నా రు. విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న విద్యాదీవెన కింద కిట్లు పంపిణీ చేసేందుకు కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం లో మార్పులు చేప‌ట్టి.. మెనూను తానే స్వ‌యంగా త‌యారు చేశారు. గ్రామ స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా 4 ల‌క్షల మందికి ఉపాధి క‌ల్పించారు.

ఇక‌, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న సేవ‌ల్లో లోపాల‌ను గుర్తించేందుకు కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌ను స్వీక‌రించేందుకు స్పంద‌న అనే కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింద‌న‌డంలో సందేహం లేదు. ఈ ప‌రంప‌రలోనే జ‌గ‌న్ తాజాగా మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తాను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు అనేక ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా  ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.

నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10 వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ప్రతి ఏడాది రూ. 10వేల చొప్పున అందిచాలని సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఆయా వృత్తుల్లో ఉన్న‌వారంతా దాదాపు బీసీ వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో జ‌గ‌న్‌తీసుకున్న నిర్ణ‌యం వైసీపీకి బీసీల‌ను చేరువ చేస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news