పెళ్లికి సిద్ధమవుతున్న ఓ యువకుడు ముద్రించిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుభలేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఏంటి.. అసలు అందులో ఏముంది.. అని అనుకుంటున్నారా..? అమరావతిని రక్షించండి.. రైతులను కాపాడండి అనే నినాదంతో కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన జాస్తి సురేష్ తన పెళ్లి పత్రికను వినూత్నంగా తయారు చేయించారు. దీనికి కూడా ఓ కారణం ఉందండోయ్. సురేష్ వివాహం సందర్భంగా పెళ్లి పత్రికల్లో అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. సురేష్ నిశ్చితార్థం గత వారంలో జరిగింది.
అయితే ఈ కార్యక్రమానికి హాజరైన బంధువులు భోజనం చేయకుండానే వెళ్తుండడాన్ని గమనించిన సురేశ్.. కారణం ఆరాతీశాడు. తాము వెంటనే వెళ్లి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాల్సి ఉందని చెప్పారు. దీంతో ఆలోచనలో పడిన సురేశ్.. తాజాగా ముద్రించిన వివాహ శుభలేఖలపై అమరావతిని రక్షించాలని ముద్రించి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపాడు. ‘అమరావతిని రక్షించండి.. రైతులను రక్షించండి’ అని ప్రముఖంగా కనపడేలా శుభలేఖపై ముద్రించి అందరికీ పంచిపెట్టాడు. దీనిని ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.