గతంలో ఎందరు ముఖ్యమంత్రులు మారినా… రైతులు కోరింది ప్రధానంగా రెండే రెండు కోరికలు! పగటి పూట కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వమని మరియూ దళారీ వ్యవస్థను రూపుమాపమని! అవి రెండూ జరిగితే రైతే రాజు అనే మాటకి న్యాయం జరిగినట్లు అవుతుందని! ఈ క్రమంలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోన్న జగన్ రైతులకు పగటి పూట ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇస్తామని ప్రకటించడం తర్వాత.. ఈనెల 30న మరో సంచలానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే విధంగా.. దళారీ వ్యవస్థను పూర్తిగా తీసివేయడమే లక్ష్యంగా “రైతు భరోసా కేంద్రాలు” ఏర్పాటు చేయనున్నారు! ఇవన్నీ సక్రమంగా జరిగితే మాత్రం రైతు రాజైనట్లే!
వివరాళ్లోకి వెళ్తే… రైతు భరోసా కేంద్రాలే గ్రామాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయని.. రైతు ముఖంలో ఆనందాలను కలిగిస్తాయని జగన్ సర్కారు బలంగా నమ్ముతోంది. దీంతో… రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 30 ని ముహూర్తంగా నిర్ణయించిన జగన్ సర్కార్… రైతు భరోసా కేంద్రాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేపనిలో ఉంది!
ఈ రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల ముందులు రైతుకు అందుబాటులో ఉంచడంతోపాటు.. ప్రభుత్వ స్టాంప్ వేసిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే కార్యక్రమం కూడా ఈ ఆర్‌బీకేల ద్వారా జరగనుంది. ఇదే క్రమంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్, టీవీ సౌకర్యం ఏర్పాటు చేసి… తద్వారా ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే… ఆర్‌బీకే అనేది రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రంగా కూడా పనిచేయబోతోంది!
ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రైతుభరోసాకేంద్రంలోనూ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు. గ్రామ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీతో కలిసి ఈక్రాపింగ్ చేయడం.. రైతుకు పంట రుణాలు ఇప్పించడం.. ఇదే క్రమంలో ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులు ఈ ఆర్‌బీకే కేంద్రం చేస్తుంది. వీరితోపాటు ఈ ఆర్‌బీసీల నియంత్రణ కోసమే జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ ను జగన్ సర్కార్ నియమించింది!