ఏపీలో స్థానిక ఎన్నికల విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అంతా జోరుగా సాగుతోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యా యి. ఇక, నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనూహ్యమైన నిర్ణ యం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఆపుతున్నామన్నారు. వాస్తవానికి అప్పటి కి ఇంకా దేశంలో కరోనా విజృంభణ లేనే లేదు. రాష్ట్రంలో అసలే లేదు. పైగా కేంద్రం కూడా ఎక్కడా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోలేదు. అయితే.. ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన ఎన్నికలకు బ్రేకులు వేశారని చెప్పుకొచ్చారు.
ఇది వివాదంగా మారింది. ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని జగన్ సర్కారు పట్టుబట్టింది. ఇక, ఈ వివాదం సామాజిక వర్గాలపై విమర్శలు చేసుకునే వరకు కూడా వెళ్లింది. అటు నుంచి కోర్టు మెట్టెక్కింది. కమిషనర్ పదవి కాలం ముగిసేలా ఓ ఆర్డినెన్స్ తీసుకురావడం, దీనికి హైకోర్టు కొట్టేయడం.. మొత్తంగా నిమ్మగడ్డ విజయం సాధించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంది.
దీనిపై స్పందించిన సర్కారు కరోనా నేపథ్యంలోనే ఆపివేసినట్టు తెలిపింది. అయితే, మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న హైకోర్టు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు బదిలీ చేసింది. అయితే, ఇప్పుడు కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ ఏం చెబుతారు? ప్రబుత్వం ఏంచేస్తుంది. గత పరిణామా లతో రాష్ట్ర సర్కారు నిమ్మగడ్డపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎన్నికల నిలుపుదల విషయంలో కనీసం ప్రబుత్వానికి ఒక్కమాట కూడా చెప్పకపోవడాన్ని వేలెత్తి చూపింది. ఇప్పుడు మరి ఎన్నికల విషయంలో నిమ్మగడ్డప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.
గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. మీరేం చేయాలనుకున్నా.. ముందు సర్కారుకు చెప్పి చేయాలని ఆదేశించింది. ఇప్పుడు.. నిమ్మగడ్డ ఎన్నికలకు రెడీ అనే అవకాశం ఉంది. కానీ, సర్కారు కాదనే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇది హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని… అటు నిమ్మగడ్డ, ఇటు జగన్లు మరోసారి వివాదానికి తెరదీసే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-vuyyuru subhash