వైసీపీ యువ నాయకుడు, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో అనూహ్యంగా తెరమీదికి వచ్చిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి.. వైసీపీ టికెట్‌ను దక్కించుకున్నారు. నిజానికి ఇక్కడ వైసీపీ గెలుపును అప్పట్లో ఎవరూ ఊహించలేదు. దీనికి ప్రధాన కారణం.. సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి బరిలో నిలవడం. పైగా వెంకటే గౌడ రాజకీయాలకు కొత్తకావడం. ఈ రెండు కారణాలతో ఇక్కడ వైసీపీ బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, అనూహ్యంగా జగన్ సునామీతో వెంకటేగౌడ విజయం సాధించారు.
అయితే, ఎన్నికలు పూర్తయి.. పదిమాసాలు అయినప్పటికీ.. ఎప్పుడూ పెద్దగా వార్తల్లోకి ఎక్కని వెంకటేగౌడ తాజాగా మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించడంతోపాటు ఓవర్గం మీడియాలో ఆయన టార్గెట్ అయ్యారు. అంతేకాదు, సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం జగన్ నుంచి వార్నింగ్ ఇప్పించుకునే స్థాయికి వెళ్లారు. మరి ఇలా ఎందుకు జరిగింది? అసలు కథేంటి? అంటే.. పలమనేరు పరిధిలోని వీకోట ప్రాంతంలో ఓ కల్వర్టును నిర్మించారు. అయితే, దీనిపై వివాదాలు నడుస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనేది కొందరివాదన. అంతేకాదు, దీని నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెబుతున్నారు.
దీంతో ఈ కల్వర్టు నిర్మాణం పూర్తి చేసుకున్నా.. ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. అయితే, తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ నిర్మాణాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే వెంకటే గౌడ నిర్ణయించుకున్నారు. అయితే, దీనికి సంబంధించి గడిచిన మూడు నాలుగు నెలలుగా ముహూర్తాలు నిర్ణయించడం. ఆ వెంటనే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. అయితే, తాజాగా ఈ కల్వర్టును ఆయన ప్రారంభించారు. అది కూడా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్న సమయంలో దాదాపు వంద మంది అనుచరులతో కలిసి వెళ్లి.. లాక్డౌన్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా గౌడ ఈ కల్వర్టును ప్రారంభించారు.
దీంతో ఇది రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాలపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. లాక్డౌన్ అమలు విషయంలో ఎమ్మెల్యే నిబంధనలు పాటించక పోవడంపై వారు నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కరోనా ఉన్న నేపథ్యంలో.. అందులోనూ పలమనేరులో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఉన్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మరీ జనాలతో దండలు వేయించుకుని ఎమ్మెల్యే అక్కడ కల్వర్టు ప్రారంభించారు. దీనిపై మీడియాలో ఎమ్మెల్యే కరోనా ఉన్నా సోషల్ డిస్టెన్స్ పాటించలేదని విమర్శలు రావడంతో ఎమ్మెల్యే మీడియాను తిడుతూ మళ్లీ ఓ వీడియో సైతం రిలీజ్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా జగన్ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి తన దూకుడు తనకు వార్నింగ్ ఇచ్చేలా చేసిందని గౌడ అనుచరులు అంటున్నారు.