ఏపీ అధికార పార్టీ వైసీపీకి అన్నీ తానై అధినేత తర్వాత అధినేత అని అనిపించుకున్న అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గడిచిన కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఆయన ఏమయ్యారనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పార్టీని ముందుండి నడిపించిన ఆయన విశాఖ సహా పలు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎప్పటికప్పుడు తూర్పారబట్టిన ఆయన బాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్‌పైనా సమయానికి తగిన విధంగా విరుచుకుపడుతూ.. రాజకీయంగా సంచలనాలకు కేంద్రంగా మారారు. రాజకీయాల్లో ఉన్న వారు ఎక్కువగా ట్విట్టర్‌ను వినియోగించడం అనేది ఏపీలో విజయసాయితోనే ప్రారంభమైంది. యూటర్న్ అంకుల్ అని ఆయన చంద్రబాబును సంబోధించి సోషల్ మీడియాకు మంచి ఊపు తెచ్చారు. అదేసమయంలో పార్టీ ప్రవేశ పెట్టిన నవరత్నాలకు కూడా అదే తరహాలో ప్రచారం చేసి పెట్టారు.
ఎన్నికలకు ముందు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహ కర్తలను నియమించుకున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులోనూ తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. జగన్‌కు సంబంధించి కేంద్రంలో నిర్వహించాల్సిన అన్ని పనులను కూడా ఆయనే చూసుకునే వారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీకి కూడా సన్నిహితంగా అంటే పేరు పెట్టి పిలిచేలా వ్యవహరించే స్థాయికి విజయసాయి చేరుకున్నారు.అలాంటి నేత గడిచిన రెండు వారాలుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.
అదేసమయంలో ఆయన ట్విట్టర్లో మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. దీంతో ఆయన అసలు ఇండియాలో ఉన్నారా? ఉంటే మాట్లాడకుండా.. కామెంట్లు చేయకుండా ఎలా ఉన్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల కొన్ని కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజయసాయి..కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ విషయంలో తామే తొలుత చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్న బీజేపీ పెద్దలు కోర్టులను ఆశ్రయించాలని, కోర్టులు డైరెక్షన్ చేస్తే.. తాము రంగంలోకి దిగుతామని చెప్పారు.
ఈ క్రమంలోనే ఓ టీవీ ఛానెల్ మాజీ సీఈవోపై విజయసాయి నేరుగా కోర్టుకు వెళ్లారు. అయితే, ఈ విష యంలో జగన్ దగ్గర విజయసాయికి అక్షింతలు పడ్డాయని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని మరికొందరు అంటు న్నారు. కాదు, విజయసాయి వ్యవహరిస్తున్న తీరుపై జగన్ కొంత ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ఆయన మౌనం పాటిస్తున్నారని అనే వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.