సీఎం వైఎస్ జగన్ ఒక అడుగు వెనక్కు వేశారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాస్త తగ్గారు మొదట.. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుందని చెప్పినా.. ఇప్పుడు వెనుకడుగు వేసారు.
తన నిర్ణయంపై విమర్శలు రావడంతో ఆయన పురాలోచనలో పడ్డారు. ముందస్తు సన్నద్ధత లేకుండా ఎలా తెలుగు మీడియం తీసేస్తారన్న విమర్శలను పరిగణలోకి తీసుకున్నారు. తన నిర్ణయంలో కాస్త మార్పు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఆరోతరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత దాన్ని పదో తరగతి వరకు తదుపరి విద్యా సంవత్సరాల్లో విస్తరిస్తారట.
సహజంగా జగన్ మొండివాడని చెబుతుంటారు. ఓసారి డిసైడ్ అయితే తన మాట తానే వినడని అంటుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం విమర్శలు లాగానే నిర్ణయాన్ని సమీక్షించుకున్నారు. విద్యాశాఖతో సమీక్ష నిర్వహించిన జగన్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు – నేడులో భాగంగా ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని అధకారులకు సూచించారు.
అంతే కాదు.. బోధనలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు. జగన్ వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయి. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనుబడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ విద్య అత్యవసరమని సీఎం భావించారు.