మీ పాపం పండింది.. దొరల పాలన విముక్తిని తెలంగాణ కోరుకుంటుంది – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో రైతులు తుఫానులో, నిరుద్యోగులు ఉప్పెనలో, ఉద్యోగులు సుడిగాలిలో, విద్యార్థులు వరదల్లో కొట్టుకుపోయినా దొర గారికి సోయి లేదు.. కానీ పక్క రాష్ట్రంలో మాత్రం రైతుల తుఫాను రాబోతుందని బొంకుతున్నారని దుయ్యబట్టారు.

తొమ్మిదేండ్లలో 9వేల మంది తెలంగాణ రైతులు చనిపోతే పట్టింపు లేదు. అప్పులపాలై కౌలు రైతులు ఉరికంభం ఎక్కుతుంటే ఆదుకున్నది లేదు. రైతులకు రుణమాఫీ అని, మూడెకరాల భూమి అని, పోడు పట్టాలు అని నమ్మించి గుంట నక్కలా రైతుల ఓట్లు తిన్నావు. రాయితీ ఎరువులు, పంట నష్ట పరిహారం ఇవ్వకుండా అన్నదాతను ఆగం జేశావని మండిపడ్డారు షర్మిల.

రైతుల సాక్షిగా వందకు వంద శాతం ఎరువులు ఫ్రీ అని నమ్మక ద్రోహం చేశావని.. సబ్సిడీ ఎరువులను సైతం ఎత్తేశావు. చేతికొచ్చిన పంట నీటి పాలైనా రూపాయి కూడా విదల్చలేదు. వరి వేస్తే ఉరేనని, కౌలు రైతు అసలు రైతే కాదని రైతుద్రోహిగా మిగిలావు. ఇప్పుడు నేను రైతు నేస్తం అని మొసలికన్నీరు కారుస్తున్నావని మండిపడ్డారు.

తెలంగాణలో అధికారం దూరం కాబోతుందని, ఇక్కడి రైతులు, జనం చీదరించుకుంటున్నారని దేశం బయలుదేరిన నీకు ఎక్కడికి వెళ్లినా గుణపాఠం తప్పదన్నారు. తెలంగాణ సంపదను దోచుకొని, దేశ సంపద కోసం బయలుదేరిన నీకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మీ పాపం పండింది.. దొరల పాలన విముక్తిని తెలంగాణ కోరుకుంటోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news