వైస్సార్ జగనన్న కాలనీలకు నేడే శ్రీకారం

అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో కూడా సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా వైస్సార్ జగనన్న కాలనీల పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 15 లక్షల 60 వేల 227 ఇళ్లకు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం జగన్ సర్కార్ రూ. 28 వేల 084 కోట్ల నిధులను కేటాయించింది. ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించనుంది. స్థలం ఉండీ కట్టుకోలేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్రంలో 4 లక్షల 33 వేల మంది ఇల్లు కట్టుకోలేని వాళ్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు.

ఇక జూన్ 2023 నాటికి రెండు విడతల్లో 28 లక్షల 30 వేల 227 ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకు రూ. 50 వేల 994 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. రెండో విడత కింద 12 లక్షల 70 వేల ఇళ్లను రూ. 22 వేల 860 కోట్లలో నిర్మించనున్నారు. జూన్ 2023 నాటికి వీటిని నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.