నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ స్థాపించకముందే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను భుజానకెత్తుకున్నామని వివరించారు. ఇంటికో ఉద్యోగమని, నిరుద్యోగ భృతి అని బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తే.. రెండు కోట్ల ఉద్యోగాలని బీజేపీ దేశాన్ని మోసం చేసిందని మండిపడ్డారు.
నిరుద్యోగ సమస్యపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని T-SAVE ఫోరం ఏర్పాటు చేసి, అన్ని పార్టీలను ఆహ్వానించామని తెలిపారు షర్మిల. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామని అన్ని పార్టీలను కోరానన్నారు. ఎవరు వచ్చినా, రాకున్నా YSR తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు షర్మిల. ఈ ఉద్యమంలో అరెస్టులు ఎదురైనా, నిర్బంధించినా వెనక్కి తగ్గేది లేదన్నారు. పార్టీ శ్రేణులకు, విద్యార్థి సంఘాలకు YSR తెలంగాణ పార్టీ అండగా ఉంటుందన్నారు.