రోజు రోజుకూ అమరావతి ఉధ్యమం ఉధృతమవుతోంది. 49వ రోజు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు రాజధాని రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంగా ప్రకటించి, భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు పునరాలోచన చేస్తోందని, దీనిని సహించబోమంటూ అమరావతి రైతులు పేర్కొంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ వారు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. వీళ్లకు ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వీళ్ల పోరాటానికి మద్దతు పలుకుతూ నిరసనలు కూడా చేశారు.
ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన మానవహారాలు, 7న క్యాండిల్ ర్యాలీ, 8న ‘చంద్రబాబుకి బుద్ధి రావాలి’ అని కోరుతూ పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న అన్ని జిల్లాల్లో మేధావులతో, రౌండ్ టేబుల్ సమావేశాలు, 12న వంటావార్పు, 13న రిలే దీక్షలు, 14న గులాబీలు, కరపత్రాల పంపిణీ, 15న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించనున్నారు.