రాష్ట్రాన్ని కుదిపేసిన అగ్రిగోల్డ్ విషయంపై బుధవారం నాటి అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సంద ర్భంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి.. తనమనసులో మాటలను సున్నితంగా సుత్తి లేకుండా వెల్లడించారు. అదేసమయంలో ప్రతి మాటలోనూ చంద్రబాబుకు , ఆయన కుమారుడు లోకేష్‌కు కూడా సున్నితంగానే సుత్తి దెబ్బలు వేశారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఏర్పాటైంది చంద్రబాబు హయాంలోనే నని, అది కూడా 1995లోనేనని చెప్పిన రాచమల్లు.. తర్వాత 2012 వరకు సంస్థ ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి నా బాగానే నడిచిందని, డిపాజిటర్లకు న్యాయం చేసిందని ఆయన వెల్లడించారు.
అదేసమయంలో రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్ని ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సంస్థ తన ఆస్తుల ను పోగేసుకోవడం ప్రారంబించిందని అన్నారు. ఇక, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహిం చిన వస్తు న్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులపై ఆరా తీశారని, ఈ క్రమంలోనే వారికి మంగళగిరి హైవేకి అతి చేరువలో హాయ్ ల్యాండ్ కనిపించిందని, దాదాపు 16 ఎకరాల విస్తీర్ణం ఉన్న దీనిని లోకేష్ తన ఖాతాలో వేసుకునేందుకు చక్రం తిప్పారని, ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి హాయ్‌ల్యాండ్‌లో విడిది ఏర్పాటు చేశారని రాచ మల్లు వివరించారు.
ఇక, ఈ ఆస్తులను ఏదో ఒక రూపంలో సొంతం చేసుకునే ఉద్దేశంతోనే కేసులను నిర్వీర్యం చేసే ప్రక్రియ కు చంద్రబాబు ఆయన కుమారుడు శ్రీకారం చుట్టబట్టి ఈ కేసులు నానుస్తూ వచ్చాయని తెలిపారు. మొత్తానికి చంద్రబాబు ఆయన కొడుకు కారణంగా మొత్తం 19 లక్షల మంది డిపాజిటర్లలో 400 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ.. రాచమల్లు సున్నితంగానే విమర్శించినా.. గట్టిగా చంద్రబాబును దుయ్యబట్టడం గమనార్హం.
అయితే, ఇంత జరుగుతున్నా.. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కానీ, ఆఖరుకు సభలోనే ఉన్న చంద్రబాబు కానీ రాచమల్లు వ్యాఖ్యలను తిప్పికొట్టలేక పోవడం గమనార్హం. దీంతో అగ్రిగోల్డ్ విషయంలో చినబాబు జోక్యం కారణంగానే ఈ కేసులు నత్తనడకన సాగాయా? అనే సందేహం తెరమీదికి వచ్చింది.