దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నెలకొంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం లేదు. కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యటం వల్ల కరోనా రోగులను కాపాడవచ్చని డాక్టర్లు తెలియజేశారు. కరోనా నుంచి కోలుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా ఏపీలో కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కొవిడ్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో వైద్యులు ఆయన నుంచి మంగళవారం 400 మిల్లీలీటర్ల ప్లాస్మా సేకరించారు. గత నెలలో కొవిడ్ బారిన పడ్డ ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యుల సూచనతో హోం ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. కాగా, ప్లాస్మా దానం చెయ్యాలంటూ సినీ స్టార్స్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.