వైఎస్సార్ సీపీ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటిన సహించే ప్రసక్తే లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విధేయత మరిచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే.. ఎంతటివారైనా సహించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలా చేయకుండా నేరుగా మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు.
జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు పరోక్షంగా జిల్లాకు చెందిన మంత్రి అనిల్‌ను ఉద్దేశించి చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.