ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ ఘాట్ దగ్గర వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయలక్ష్మి నివాళులు అర్పించారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను వారు గుర్తు తెచ్చుకున్నారు.
ఇక వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు…” నాన్నా… మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం” అని అన్నారు.అలాగే “జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గదర్శనం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.” ఉంటుందని ట్వీట్ చేశారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు అభిమానులు నివాళులు అంటూ హోరెత్తిస్తున్నారు. తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నివాళులు” అంటూ వైసీపీ సోషల్ మీడియాలో స్మరించుకుంటున్నారు.సమ సమాజ నిర్మాణం,ఆరోగ్యం, విద్య , సంక్షేమం తో పాటు రాష్ట్ర అభివృద్ధికి జలయజ్ఞం నిర్వహించిన అపర భగీరథుడిగా రాజశేఖర్ రెడ్డిని జనం స్మరించుకుంటున్నారు.