వై.వి.ఎస్. చౌదరి మోహన్ బాబు చెక్ బౌన్స్ కేసు తీర్పు 2 ఏప్రిల్ 2019న చౌదరికి అనుకూలంగా రావడం తెలిసిందే. కాగా ఈ తీర్పు వెలువడిన తరువాత మోహన్ బాబు తమపై ఇంకా దౌర్జన్యం చేస్తున్నారని మీడియాకి ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. తన కష్టార్జితంతో కొన్న స్థలంలోకి తననుగానీ, తమవాళ్లను గానీ కాళ్లు కూడా పెట్టన్విట్లేదని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. ఈమేరకు శాశ్వత పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, లీగల్ నోటీస్ కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. వై.వి.ఎస్.చౌదరీ మీడియాకు రాసిన లేఖ యధాతధంగా…
మీడియా మిత్రులందరికీ నమస్కారం..
వై.వి.ఎస్. చౌదరి అను నేను శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై శ్రీ యం. మోహన్‌బాబు నిర్మించిన, ‘సలీమ్’ (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగానూ, రెమ్యూనరేషన్ నిమిత్తం శ్రీ యం. మోహన్‌బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్ విషయమై, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం ’23వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు’ ఎర్రమంజిల్, హైదరాబాద్ వారు.. 2 ఏప్రిల్ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం మీ అందరికీ తెల్సినదే.
ఈ నేపథ్యంలో శ్రీ యం. మోహన్‌బాబు.. సదరు న్యాయసానాన్ని నేను తప్పుదోవ పట్టించినట్లుగా తీర్పు వెలువడిన తదనంతర పత్రికా ప్రకటనలో పేర్కొనడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు శ్రీ యం. మోహన్‌బాబు జల్‌పల్లి గ్రామం, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై ‘సలీమ్’ చిత్ర నిర్మాణ సమయంలోనే నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, పైన పేర్కొన్న చెక్ బౌన్స్ కేసు కోర్టు తీర్పు తరువాత నన్ను, నా మనుషుల్ని నా స్థలంలోకే రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం నేను న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు.
ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే
మీ
వై.వి.ఎస్. చౌదరి
సినీ దర్శక-నిర్మాత