- ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం
- పలు రంగాలకు చెందిన మరో ముగ్గురికి విశేష పురస్కారం
విజయవాడ: వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేషంగా సేవలందిస్తున్న పలువురికి ఈ ఏడాది కూడా డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరఫున విశిష్ట, విశేష పురస్కారాలను ప్రధానం చేస్తున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఛైర్మన్ ధర్మప్రచారక్ రామినేని తెలిపారు. గురువారం ఉదయం నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ రామినేని అయ్యప్ప చౌదరి 1995లో అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సిన్సినాటిలో డాక్టర్ రామినేని ఫౌండేషన్‌ను స్థాపించారని పేర్కొన్నారు. తద్వారా భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడం కోసం తమ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. అలాగే కళలు, విజ్ఞాన, మానవీయత వంటి వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రజాహితం కోరుతూ ఉదారతను చాటే ప్రముఖులను సత్కరించడం కూడా తమ సంస్థ ప్రాధమిక లక్ష్యంగా స్వీకరించిందని తెలిపారు. అందులో భాగంగా ప్రతిఏటా వివిధ రంగాలకు చెందిన పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రధానం చేస్తున్నామన్నారు.
ఈ నెల 7న గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది పురస్కారాలు అందుకునే వారిలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, డాక్టర్ పుల్లెల గోపీచంద్‌కు రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి (మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు విశేష పురస్కారాలు అందజేయనున్నామని వెల్లడించారు. రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, బిసిసిఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, డిజిపి ఆర్పీ ఠాకూర్‌లు విచ్చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రియా సిస్టర్స్‌తో గాత్ర సంగీత కచేరి ఉంటుందని వివరించారు.