ప్రపంచ దేశాలలో అగ్ర రాజ్యం అమెరికా. అన్ని దేశాల వారు అమెరికాలో సెటిల్ అవ్వటానికి అక్కడ పౌరసత్వం పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అదే తరహాలో భారతీయులు కూడా ఎక్కువగా యూఎస్ మీదనే మొగ్గు చూపుతారు. ఉన్నత విద్య అయినా , ఉద్యోగమైన, ఎక్కువ మంది మొదటి ప్రాధాన్యత అమెరికాకే ఇస్తారు. అయితే ఇందుకు కొంచెం భిన్నంగా ప్రస్తుత భారతీయుల ఆలోచనలు ఉన్నాయట. భారతీయులు తమ రూటును మార్చి ఇంకో దేశం వైపు మొగ్గు చూపుతున్నారట.. దీనికి కారణం..
ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తరువాత వీసా జారీ విషయంలో అమెరికా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, వలసలపై పరిమితులు విధించడమే కారణం అంటున్నారు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపీ) సంస్థ వారు. ఈ సంస్థ వారు తెలిపిన వివరాల ప్రకారం గత మూడేళ్ళ కాలంగా భారతీయులు ఎక్కువ శాతం కెనడా వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాగా..
2016 లో కెనడాలోని భారతీయుల సంఖ్య కేవలం 39,705 ఉండగా, 2019 నాటికి వీరి సంఖ్య 80,685 కి పెరిగిందట, అంటే 105 శాతం పెరిగింది. విద్య, ఉద్యోగం,ఉపాధి ఇలా ఏదైనా సరే ఇండియన్స్ భారీ మొత్తంలో కెనడాకు వెళ్ళినట్లు ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టూవార్డ్ పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలలో అగ్రరాజ్యం కఠిన వ్యవహారిక పరిణామాల వలనే కెనడాకు వెళ్ళే భారతీయుల సంఖ్య ఇంతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు..భారతీయలవద్ద ఉన్న అపారమైన తెలివి, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించుకుని ఎంతో ఎత్తుకు ఎదిగిన అమెరికా బాటలోనే బ్రిటన్ పయనిస్తోంది అంటున్నారు నిపుణులు.