స్కిన్ అల‌ర్జీలు ఉన్న‌వారు ఫేస్ మాస్క్‌లు ధ‌రిస్తే క‌ష్ట‌మే..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అంద‌రూ నోరు, ముక్కుల‌ను క‌ప్పి ఉంచేందుకు ఫేస్ మాస్క్‌ల‌ను ధ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కొంద‌రు పూర్తి ముఖం క‌ప్పి ఉంచేలా ఫేస్ షీల్డ్‌ల‌ను కూడా ధ‌రిస్తున్నారు. అయితే స్కిన్ అల‌ర్జీలు ఉన్న‌వారు ఫేస్‌ మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు చెబుతున్నారు.

scientists warn that wearing face masks can trigger skin problems in skin allergic people

అమెరికాలో ఈ ఏడాది జ‌రిగిన వర్చువ‌ల్ అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ అల‌ర్జీ, ఆస్త‌మా అండ్ ఇమ్యునాల‌జీ (ఏసీఏఏఐ) వార్షిక సైంటిఫిక్ మీటింగ్‌లో ఏసీఏఏఐ స‌భ్యుడు య‌శు ధ‌మిజ ఒక వైద్య ప‌ర‌మైన కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 60 ఏళ్ల ఒక వ్య‌క్తికి ఎగ్జిమా ఉంద‌ని, కానీ అది కంట్రోల్‌లోనే ఉండేద‌ని, అయితే ఏప్రిల్ నుంచి క‌రోనా నేప‌థ్యంలో మాస్కుల‌ను ధ‌రించ‌డం మొద‌లు పెట్టాక అది అత‌నిలో తీవ్ర‌మైన చ‌ర్మ స‌మ‌స్య‌లు క‌లిగించింద‌ని తెలిపారు.

మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల స‌ద‌రు వ్య‌క్తి ముఖంతోపాటు మాస్క్‌కు ఉండే ఎల‌స్టిక్ బ్యాండ్స్ ముఖానికి త‌గిలే చోట విప‌రీత‌మైన ద‌ద్దుర్లు ఏర్ప‌డి దుర‌ద వ‌చ్చింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో అత‌నికి ప‌లు మెడిసిన్ల ద్వారా చికిత్స అందించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. క‌నుక స్కిన్ అల‌ర్జీలు ఉన్న‌వారు క‌రోనా కోసం ఫేస్ మాస్క్‌ల‌ను ధ‌రిస్తుంటే జాగ్ర‌త్త వ‌హించాల‌ని చెబుతున్నారు. ఎల‌స్టిక్ బ్యాండ్స్ ఉన్న మాస్క్‌లు కాకుండా క్లాత్ బ్యాండ్స్ ఉండే మాస్క్‌ల‌ను ధ‌రించాల‌ని, అలాగే మాస్క్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల‌ని చెబుతున్నారు. ఇక స్కిన్ అల‌ర్జీలు ఉన్న వారు మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల అల‌ర్జీ ఎక్కువ‌వుతుంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా చ‌ర్మ వ్యాధుల నిపుణుల‌ను సంద‌ర్శించి చికిత్స తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.