ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ ఇంకా విజృంభిస్తూనే ఉంది. మరోవైపు సైంటిస్టుల వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు వచ్చేశాయి. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొందరు సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. అదేమిటంటే..
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులార్ వైరాలజీ, యూఎల్ఎం యూనివర్సిటీ మెడికల్ సెంటర్, టెక్నిషె యూనివర్సిటాట్ డ్రెస్డెన్, కాగ్నివెర్డె జీఎంబీహెచ్ లకు చెందిన సైంటిస్టులు ఇటీవలే కరోనా వైరస్‌ను చంపే పదార్థాలపై ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వారు దానిమ్మ పండు జ్యూస్, గ్రీన్, చోక్‌బెర్రీ జ్యూస్, ఎల్డర్‌బెర్రీ జ్యూస్‌లలో కరోనా వైరస్‌ను ఉంచి ప్రయోగాలు చేశారు. దీంతో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
చోక్‌బెర్రీ జ్యూస్‌లో ఉంచిన కరోనా వైరస్ 5 నిమిషాల్లోనే 97 శాతం వరకు అంతమైందని సైంటిస్టులు గుర్తించారు. అలాగే గ్రీన్ టీ, దానిమ్మ పండు జ్యూస్‌లలో ఉంచిన వైరస్ అంతే సమయంలో 80 శాతం వరకు నశించదని గుర్తించారు. ఇక ఎల్డర్ బెర్రీ జ్యూస్ వైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదని తేల్చారు. ఈ క్రమంలో ఆయా జ్యూస్‌లు, పానీయాలలో కరోనా వైరస్ ఎక్కువ సేపు ఉండలేదని, వెంటనే నశిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇక అవే జ్యూస్‌లు, పానీయాల్లో స్వైన్ ఫ్లూ వైరస్‌ను ఉంచి పరీక్షించగా.. అన్నింటిలోనూ కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే స్వైన్ ఫ్లూ వైరస్ బతికి ఉందని, ఆ తరువాత 99 శాతం వరకు వైరస్ నశించిందని గుర్తించారు. అందువల్ల ఈ వ్యాధికి కూడా ఆయా పానీయాలు ఔషధాలుగా పనిచేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.