స్లీపింగ్ పెరాలసిస్ : నిద్రలో దెయ్యం మీ మీద కూర్చున్నటనిపించటం.. కారణం ఇదే..

స‌హ‌జంగా గాఢనిద్రలో ఉన్న‌ప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెమీద ఎవరో కూర్చొని ఉన్నట్లు, గొంతు నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. నిద్రలోనుంచి మెలకువ వచ్చినా మీ శరీరం స్పృహలో ఉండదు. గొంతు చించుకుని గట్టిగా అరిచానని అనుకుంటారు. కాని అరుపు గొంతులోనే ఉంటుంది కాని బయటకు రాదు. నవరంధ్రాలు స్తంభించిపోయినట్లు, నరాలు ఎక్కడి కక్కడ పట్టేసినట్లు మీరు కదల్లేరు మెదల్లేరు. కానీ మెలకువ అయితే ఉంటుంది. దీన్ని దెయ్యం ప‌ట్టింద‌ని పెద్ద‌లు అంటుంటారు. కానీ దీన్నే `స్లీపింగ్ పెరాలసిస్` అంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభం ఎదురవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మెదడులో నిర్ధేశిత ప్రాంతంలో చోటుచేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తుందని వారు తెలిపారు. దీనినే మనం దెయ్యంగా భావించి భయపడతామని వారు స్పష్టం చేశారు. నిద్రిస్తున్న స‌మ‌యంలో ఒక్క కండరాన్ని కూడా కదల్చలేని పరిస్థితిలో, ఏదో ఉనికి గదిలో స్పష్టం అవుతూ ఉండగా, మ‌న‌ ఛాతి మీద కూర్చుని ఊపిరిని నొక్కేస్తూ ఉండ‌డమే స్లీపింగ్ పెరాలసిస్ అంటారు.

అలాగే నిద్రపోయినప్పుడు పిలిస్తే కొంతమంది ఇట్టే లేస్తారు. ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. కానీ అతి తక్కువ శాతం మంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. దీనినే ఆధునిక వైద్యం స్లీప్ పెరాలసిస్ అని స్ప‌ష్టం చేసింది. నిద్ర సమయంలో మెదడు, శరీరం ఒక్క చోట లేనప్పుడు స్లీపింగ్ పెరాలసిస్ చోటు చేసుకుంటుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనుషులకు రకరకాల బ్రమలు కలుగుతాయి. కానీ దీని వ‌ల్ల ఎలాంటి హానిక‌రం ఉండ‌దు.