ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్‌ వ్యోమనౌక.. మూడోసారి రోదసిలోకి సునీతా విలియమ్స్‌

-

ఎట్టకేలకు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక బుధవారం రోజున నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు. వీళ్లు ఈరోజు (జూన్ 6వ తేదీ) ఈ కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడే వారం బస చేసి తిరిగి స్టార్‌ లైనర్‌లో భూమికి తిరిగొస్తారు.

ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర. దీన్ని గత నెల మొదటి వారంలో రోదసిలోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రాకెట్‌లో సమస్యలు రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. గతవారం మరోసారి స్టార్‌లైనర్‌ ప్రయోగానికి ప్రయత్నించగా.. సాంకేతిక ఇబ్బందులతో మళ్లీ ఆపేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ముచ్చటగా మూడో ప్రయత్నంలో బుధవారం ఈ వ్యోమనౌక నింగిలోకి బయల్దేరింది. ఈ యాత్ర విజయవంతమైతే.. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను పంపడానికి మరో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుందని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news