ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈనెల 20న ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణానికి కాస్త స్పెషాలిటీ ఉంది. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు. ఒకే రోజు మూడు రకాల సూర్యగ్రణాలు కనిపించనుండటం వల్ల వాటిని హైబ్రిడ్ గ్రహణంగా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం లేదంటే కంకణాకార సూర్యగ్రహణం అని కూడా పిలుస్తుంటారు.
ఈ నెల 20న ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1.29 గంటల వరకు కొనసాగనుంది. ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదని జాతీయ అవార్డు గ్రహీత సైన్స్ బ్రాడ్‌కాస్టర్ సారిక తెలిపారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్ కేప్‌లో దర్శనమిస్తుంద. ఇక హైబ్రిడ్ సూర్యగ్రహణం చివరిసారిగా 2013లో దర్శనమిచ్చింది. మళ్లీ దాదాపు 140 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.