నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్‌.. ముచ్చటగా మూడోసారి

-

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఇవాళ రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఆమె రోదసిలోకి వెళ్లడం ఇది ముచ్చటగా మూటోసారి. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుండగా.. ఇందులో సునీత.. మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు.

ఆమెతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు ఉండనున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్తానని చెప్పారు. ఐఎస్‌ఎస్‌కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news